కొన్నేళ్ళుగా అనేక సామాజిక, దైవీకమైన కార్యక్రమములు
చేయుచు సనాతధర్మములో అనేకమంది ప్రయాణించేలా
చేస్తున్నది ' శ్రీ పరాశక్తి క్షేత్రము '.
శ్రీకాళహస్తి క్షేత్ర వైభవం
- సాక్షాత్తు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిచే దక్షిణ కైలాసముగా చెప్పబడిన క్షేత్రము ఈ శ్రీకాళహస్తి మహా దివ్య క్షేత్రము.
- పరమేశ్వర భక్తి పారవశ్యంలో ఓలలాడుతూ, పరమేశ్వర చైతన్యంతో తాదాత్మ్యం చెందుతూ, పరమేశ్వరుడు పెట్టిన కఠినమైన పరీక్షలో నెగ్గి , శివుని పట్ల తన అపారమైన భక్తిను చాటిన పరమ భక్తుడు, పరమేశ్వరుని మహిమను శక్తిని లోకానికి చాటి చెప్పిన మహా భక్తులు 63 మంది నాయనార్లలో ఒకరైన శ్రీ భక్త కన్నప్ప నాయనార్ ఈ శ్రీకాళహస్తి క్షేత్రానికి చెందిన మహనీయుడు కావటం చాలా గొప్ప విశేషము.
- సప్త ఋషులు నిరంతరం ఈ క్షేత్రంలో సంచరిస్తూ భక్తులను - సాధకులను అనుగ్రహిస్తూ వుంటారనేది ఎందరో మహనీయుల వాక్కు. అలాగే ఎందరో సాధకుల అనుభవము కూడా.
- పవిత్ర స్వర్ణముఖీ నదీమ తల్లి ఉత్తర వాహినీయై ప్రవహిస్తూ ఉండగా, నదీ పరివాహక ప్రాంతమున సుందరమైన పర్వతాలు పచ్చటి పొలాలతో అలరారుతూ ఒక శిఖరముపైన భక్త కన్నప్ప నాయనార్, దిగువన శ్రీకాళహస్తీశ్వర స్వామి- శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవార్ల దివ్య దర్శనము అత్యంత ఆనంద అనుభూతిని ఇస్తుంది.
- ఒకవైపు కన్నప్ప కొండ, మరోవైపు కొండపై వెలసిన శ్రీ కనకదుర్గా అమ్మవారు,దక్షిణ దిక్కు పర్వతాలలో కాలభైరవుడు, పర్వత పాదముల చెంత దక్షిణ కాళీ దేవీ-దేవతల దర్శనం. ప్రదక్షిణ మార్గములో వెలసియున్న ఈ క్షేత్రములు కుడా తప్పకుండా దర్శించవలసిన ముఖ్యమైన పుణ్యస్థలం.
- చుట్టూ పర్వతాలు – కాలినడకన పర్వతాలలో నడుస్తూ అక్కడ పర్వతాల మధ్య వెలసిన ' శ్రీ సహస్ర లింగేశ్వరుడు' దర్శనం చాలా గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. సప్త ఋషుల చే ప్రతిష్టించబడినది అని పెద్దలు చెబుతారు. ఇదే ప్రదేశంలో పవిత్రమైన సెలయేరు. జాలువారుతూ వుంటుంది. సప్త ఋషులను కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఎన్నో అద్భుతాలను, మహిమలను ఈ సహస్ర లింగాలకొనలోని పర్వతప్రాంతంలో అనుభూతి చెందవచ్చు. సాధకులకు బాగా అనుకూలమైన వాతవరణము ఇక్కడ అప్రయత్నంగా లభిస్తుంది.
- మానవులే కాక సాలీడు, కాళ నాగు, ఏనుగు లాంటి జీవులు కూడా పరమేశ్వరునికి సేవ చేసి తరించిన ఆ మహా భక్తుల పేరు మీదనే " శ్రీకాళహస్తి" అని పిలవబడుతూ భక్తులను అనుగ్రహిస్తున్న మహా దివ్యక్షేత్రం ఈ 'శ్రీకాళహస్తి'.
- శ్రీ వల్లి - దేవసేన సమేతుడై శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వార్లు కూడా ఒక కొండపై అద్భుతమైన దర్శనం ఇస్తుంటారు.
- నవగ్రహాలను తన ఆధీనంలో నిలుపుకున్న దేవదేవునిగా ఇక్కడ శ్రీకాళహస్తీశ్వరుని కొలుస్తారు. రాహు - కేతువు పూజలకు బాగా ప్రసిద్ధి చెందినది ఈ క్షేత్రము.
- ఈ క్షేత్రoలో ఎల్లప్పుడూ 8 మంది అవధూతలు సంచరిస్తూ ఉంటారని మహనీయుల ఉవాచ.
- పంచభూత మహాలింగాలలో ఒకటైన వాయు లింగ క్షేత్రముగా, శ్రీకాళహస్తిగా, దక్షిణ కైలాస క్షేత్రముగా, సిద్ధ క్షేత్రముగా పిలువబడుతూ, అద్భుతమైన పర్వతముల సౌందర్యoతో, భక్తుల హృదయాలను తన్మయులను చేస్తున్న శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం అత్యంత పరమ పవిత్రము, ఆనందాయకము, సకల కార్యసిద్ధిప్రదము.
శ్రీకాళహస్తీశ్వరుని కొండ చుట్టూ ప్రదక్షిణ
24 కిలోమీటర్లు చుట్టు మార్గము కలిగిన ఈ క్షేత్రము నందు ప్రదక్షిణ చేయటం అనాదిగా వస్తున్న సాంప్రదాయము.
శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు పరమచార్యులు శ్రీ చంద్ర శేఖరేంద్రసరస్వతీ స్వామివార్లు కూడా ఈ క్షేత్రంలో ప్రదక్షిణ చేస్తే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అని సెలవిచ్చి ఉన్నారు. ఇటీవలికాలంలో మహనీయులు కూడా ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయమని భక్తులను ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రదక్షిణ కొరకు దక్షిణ కైలాస పర్వతాలను కలుపుతూ కొండ మార్గములోని వివిధ దేవతా క్షేత్రములను అనుసంధానం చేస్తూ దేవస్థానమును వారు చేసి చాలా అద్భుతముగా రోడ్డు మార్గమును నిర్మించియున్నారు.
ప్రదక్షణ ఎలా చేయాలి - ఫలితాలు ఏమిటి?
భక్తుడు తన మనస్సును భగవంతుని మీద నిలిపి
భగవంతుడిని స్మరణ చేస్తూ, కాలినడకన కొండనే పరమేశ్వరుడిగా భావించి ప్రదక్షిణ చేయటం వలన ఆ పరమేశ్వరుని చూపు ఆయా భక్తుల మీద ప్రసరిస్తుంది. అంతేకాకుండా ఇక్కడున్న సప్త ఋషుల దృష్టి కూడా భక్తుల మీద ప్రసరిస్తుంది. దైవం యొక్క దృష్టి భక్తుల మీద ప్రసరించాలంటే భక్తులు అంతటి భక్తి శ్రద్ధలతో పాటించి ప్రదక్షిణ చేయుట ఎంతైనా శ్రేయస్కరమాని మహనీయులు చెబుతారు. మాములుగా హడావిడిగా సెల్ఫోన్ మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ కాకుండా పైన చెప్పిన విధంగా భక్తిగా ప్రదక్షిణ చేయాలి.
- ఏదైనా సమస్య తీరటానికి గానీ సాధనలో ఇంకా గొప్ప స్థితికి చేరుకోవాలనిగానీ సంకల్పం పెట్టుకొని, దానికి అవసరమైన నియమనిష్టలతో ప్రదక్షిణ చేస్తే ఫలితం ఎక్కువగా కలుగుతుంది.
ప్రదక్షిణ చేసేవారికి మహా అన్న ప్రసాద వితరణ...
గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ రేణుకా పీఠము ద్వారా ఎన్నో ప్రదేశాలలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అదే సత్ సంకల్పముతో ఈ శ్రీకాళహస్తి మహా క్షేత్రము నందు కూడా ప్రతి పౌర్ణమికి ‘శ్రీ పరమేశ్వర పరాశక్తి మహా అన్న ప్రసాద వితరణ’ గత కొంతకాలంగా జరుపబడుచున్నది. ముఖ్యంగా శ్రీకాళహస్తీశ్వర కొండ చుట్టూరు ప్రదక్షిణ చేసే భక్తుల సౌకర్యార్థo, ప్రదక్షిణ మార్గములోని 13 వ మైలు వద్ద ( దక్షిణ కైలాస మండపము దాటిన తర్వాత ) రామాపురం రోడ్డు ప్రారంభంలో ఉన్నటువంటి దక్షిణ కైలాస నగర్ ( కొత్త వెంచర్ )లో వెలసినటువంటి ‘శ్రీ పరాశక్తి క్షేత్రము’ నందు మహా అన్నప్రసాద వితరణ జరుపబడుచున్నది. ప్రదక్షిణ చేసే భక్తులు వినియోగించుకోగలరని మా ప్రార్ధన.