సాయి , విద్యార్థి
హైదరాబాద్
నా పేరు సాయి క్షేమ. నేను విద్యార్థిని. మాది హైదరాబాద్. నా చిన్నతనం నుండి నా తల్లిదండ్రులు దైవభక్తిని అలవాటు చేశారు. వారు చేసే పూజలు నాకు కూడా నేర్పించారు. వారు ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడికి నన్ను తీసుకువెళ్ళి, ఆ క్షేత్రము యొక్క విశేషాలను చెప్పేవారు. ‘పూజ్య శ్రీ సాయినాధుని శరత్ బాబూజీ’ గురువుగారు నాకు నామకరణం చేశారు. నా చిన్నతనంలో ఒక పెద్ద ప్రమాదం నుండి నన్ను కాపాడి, ఆ తరువాత నాకు ‘సాయి క్షేమ’ అని నామకరణం చేశారు. ఆ తరువాత కొంతకాలానికి శ్రీ మాతాజీ గారి దర్శనం చేసుకున్న తరువాత నాకు శ్రీ బాబూజీ గారు నామకరణం చేశారని తెలుసుకుని శ్రీ మాతాజీ గారు చాలా సంతోషించారు. బాబా – బాబూజీల ఆశీస్సులు మీ కుటుంబం మీద పుష్కలంగా వున్నాయని చెప్పారు.
బాబూజీ గారి అనుగ్రహం వల్ల, అమ్మానాన్న శిక్షణ వల్ల నాకు దైవభక్తి వచ్చింది. శ్రీ మాతాజీ గారు దర్శనం వల్ల ఆ భక్తి ఇంకా సాధనగా మారింది. నాకు అమ్మవారి మంత్ర దీక్ష ఇచ్చారు. శ్రీ మాతాజీ గారి మార్గదర్శకత్వంలో ప్రతిరోజు జపం చేసుకుంటున్నాను.
ప్రతి సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో ప్రత్యేకంగా మంత్ర జపం చేయుట అలవాటు అయ్యింది శ్రీ మాతాజీ గారి ఆదేశంతో. నేను ప్రతిదానికి మా అమ్మ మీద విసుక్కునే దాన్ని. మాతాజీ గారు అది తెలుసుకొని నా ఆలోచనలను సరిదిద్ది ప్రేమగా మాట్లాడటం నేర్పించారు. నా స్టడీస్ లో ఏదైనా ఇబ్బందులు వస్తే ఎంతో ఓపికతో నాకు ధైర్యం చెప్పి ప్రోత్సహించేవారు. ఒకసారి నాకు అనారోగ్యంగా వున్నప్పుడు నాకోసం యజ్ఞం చేసి అమ్మవారి వద్ద పూజలు చేసి నాకు ఆరోగ్యాన్ని అనుగ్రహించారు. సమస్య ఎంతటిదైనా ధైర్యంగా నిలబడి అమ్మవారిని నమ్ముకొని మన పని మనం చేయాలని చెప్పేవారు. శ్రీ మాతాజీ గారితో మాట్లాడుతుంటే చాలా ఆనందంగాను, మిగితా విషయాలను మర్చిపోయేటంతగా వుంటుంది. మంత్రసాధనల్లో మెలుకువలు నేర్పించారు. నేను చేస్తున్న మంత్రము యొక్క పురశ్చరణ హోమము ‘శ్రీ రేణుక పీఠము’ లోని యాగశాలలో శ్రీ మాతాజీ గారి ప్రత్యక్ష సన్నిధిలో చేసే అవకాశం కల్పించారు. శ్రీ మాతాజీ గారు యజ్ఞం చేస్తుంటే అదొక అద్భుతమైన, దైవీకమైన దృశ్యము చూసి తీరాల్సిందే!. యజ్ఞమునకు సంబంధించిన ఎన్నో విశేషాలను నాకు నేర్పించారు.చాలా రోజులు యజ్ఞం వద్ద శ్రీ మాతాజీ గారి కార్యములలో సేవ చేసే భాగ్యం నాకు దక్కింది.
శ్రీ మాతాజీ గారు అమ్మవారి కథలను చెప్పేటప్పుడు చాలా ఆనందంగా, పారవశ్యముగా, కళ్ళకు కట్టినట్లు చెబుతారు. అవి వింటుంటే ఆ దృశ్యములన్నీ కళ్ళ ముందు జరుగుతున్నట్లుగానే అనిపిస్తుంది. శ్రీ మాతాజీ గారు ఏ కథ చెప్పినా అందులోనుంచి మన జీవితానికి ఉపయోగపడే సారాంశాన్ని అర్థం అయ్యేలా భోధిస్తారు. మాతాజీ గారి భోధన వల్ల మన భారతీయ సంస్కృతి పట్ల, పురాణాల పట్ల ఇంకా భక్తి – విశ్వాసం పెరిగింది.
శ్రీ మాతాజీ గారు రచించిన ‘శ్రీ రేణుక పరమేశ్వరి చరితామృతము’ గ్రంధము పారాయణ చేస్తుంటే అమ్మవారి జీవిత విశేషాలు కళ్ళముందే జరుగుతున్నట్లు అనుభూతి కలుగుతుంది. శ్రీ మాతాజీ గారితో కలిసి ‘ శ్రీ రేణుకా పరమేశ్వరి ‘ వెలసిన క్షేత్రము ‘మహాూర్ ఘడ్’ దర్శించాలని కోరిక.
నా జీవితంలో ఇన్ని మంచి విషయాలు తెలుసుకోవటానికి, భారతీయ సంస్కృతి పట్ల భక్తి – గౌరవం పెరగటానికి, మంత్ర సాధన చేయటానికి, హోమాల పట్ల ఆసక్తి పెరగటానికి శ్రీ మాతాజీ గారి అనుగ్రహ విశేషమే. ఏదైనా సమస్య నివారణకు శ్రీ మాతాజీ గారు యజ్ఞం చేస్తే తప్పకుండా ఆ సమస్య తీరిపోతుంది. హోమములో వచ్చే దేవతలను కూడా మాతాజీ గారు గుర్తించి చెబుతారు. ఫోటోతీస్తే అందులో దేవత రూపాలు కనిపిస్తుంటాయి. ఒకసారి ఇలాగే పూర్ణాహుతి అయ్యాక ‘ నాగమ్మ ‘ హోమములో వచ్చింది అన్నారు. వెంటనే ఫోటో తీయమని చెప్పగా, నేను ఫోటో తీశాను.
అందులో నాగదేవత ఐదు పడగలతో అద్భుతంగా దర్శనం
ఇస్తున్నది. ఇలా హోమాల వద్ద ఎన్నో ఎన్నెన్నో అనుభవాలు కలవు.
శ్రీ మాతాజీ గారి అనుగ్రహ విశేషంగా నా SSC BOARD EXAMS కూడా బాగా Pleasant గా వ్రాయగలిగాను. శ్రీ మాతాజీ గారి అనుగ్రహం నామీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారికి, శ్రీ మాతాజీ గారికి నమస్కారములు.
” జై శ్రీ రేణుక పరమేశ్వరి “