అవినాష్ , మౌల్డ్ ఇంజనీర్

హైదరాబాద్

శ్రీ రేణుక పరమేశ్వరి అమ్మవారి పాద పద్మములకు నమస్కారములు.అలాగే శ్రీ మాతాజీ గారికి హృదయపూర్వక నమస్కారములు.
శ్రీ మాతాజీ గారు పరిచయం అయినప్పటి నుండి మా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి.మా నాన్నగారు అనారోగ్యంతో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో వున్నప్పుడు మాతాజీ గారు మా నాన్నగారి కోసం దీక్ష చేసి, హోమాలు చేసి, అమ్మవారి వద్ద పూజలు చేసి మా నాన్న ప్రాణాన్ని నిలబెట్టారు. మా కుటుంబం కోసం అనేక సందర్భాలలో పూజలు- హోమాలు చేసి మమ్మల్ని రక్షిస్తున్నారు. నాకు మాతాజీ గారితో పరిచయం చాలా తక్కువ. నేను ఉద్యోగ రీత్యా హైదరాబాదులో మిషిన్స్ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మాతాజీ గారిని తలుచుకుంటాను. నాకు కలలో అమ్మవారు గానీ, మాతాజీ గారు గానీ కనిపించి ధైర్యం చెప్తారు.ఒక్కొక్కసారి రాత్రి సమయంలో ఏవో కొన్ని నన్ను పైన పడి తొక్కుతున్నట్టుగా అనిపించి బాగా భయం వేస్తుంది. అప్పుడు అమ్మవారి రూపం వచ్చి ఆ దుష్టశక్తులను తరిమి వేసినట్టుగా కనిపిస్తుంది. ఇలా ఎన్నోసార్లు జరిగింది.

శ్రీ రేణుకా పరమేశ్వరి చరితామృతం పారాయణం చేయటం వలన మనసు ప్రశాంతంగా వుంటుంది. అమ్మవారి సన్నిధిలో అన్న ప్రసాద వితరణ జరిగేటప్పుడు ఆ కార్యక్రమాలలో సేవ చేసే అదృష్టాన్ని నాకు మాతాజీ గారు ప్రసాదించారు. శ్రీ మాతాజీ గారు ఒకసారి ఏదైనా ఒక విషయం చెప్పారు అంటే అది ఖచ్చితంగా నూటికి నూరు శాతం జరిగే తీరుతుంది. నా విషయంలో మాతాజీ గారు చెప్పిన ప్రతి విషయం చెప్పింది చెప్పినట్లుగా జరిగింది.ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మాతాజీ గారు ప్రేమతో నాకు సలహాలు – సూచనలు ఇచ్చి ధైర్యం చెప్పి ప్రోత్సహిస్తారు.

యాగశాలలో దీపారాధన చేసే అవకాశం నాకు కల్పించారు. నా ఇద్దరు పిల్లలకు ‘నామకరణము’, ‘అన్న ప్రాసన’,’ అక్షరాభ్యాసము’ శ్రీ మాతాజీ గారి అమృత హస్తాలతో జరగటం చాలా ఆనందకరమైన విషయం. పెద్ద పాపకు ‘మహాలక్ష్మి’ అని, చిన్న పాపకు ‘లోకేశ్వరి’ అని పేరు పెట్టి అనుగ్రహించారు. అమ్మవారి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం నాకు కల్పించారు. కర్నూలు దగ్గర ఉడుములపాడు లోని ‘ శ్రీ రేణుక ఎల్లమ్మ’ విగ్రహ ప్రతిష్టకు మాతాజీ గారు వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళారు.అదొక అద్భుతమైన దర్శనం. అక్కడ మాతాజీ గారు సాక్షాత్తు అమ్మవారి లాగా నాకు కనిపించారు. ఆ సమయంలోనే శ్రీ మాతాజీ గారితో కలిసి జోగులాంబ, మహానంది క్షేత్రాలను దర్శించే భాగ్యం కల్పించారు.

మాతాజీ గారు అప్పుడప్పుడు స్వప్నంలో కనిపిస్తు వుంటారు. ఏదైనా భయంకరమైన కలలు వచ్చినప్పుడు, మాతాజీ గారు చెప్పిన ‘శ్రీ రేణుక పరమేశ్వరి’ నామాన్ని తలుచుకుంటే అంతటితో శాంతిస్తుంది. ఇంకా ఎన్నో అనుభవాలు వున్నాయి. శ్రీ మాతాజీ గారు జరిపించే అన్ని కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరుకుంటూ శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి పాదపద్మములకు, శ్రీ మాతాజీ గారి పాదపద్మములకు నమస్కారములు.

Scroll to Top